మహేష్ తో సినిమా గురించి త్వరలో చెబుతానన్న యువ హీరో !


సూపర్ స్టార్ మహేష్ బాబు తాను చేస్తున్న ‘స్పైడర్, భరత్ అనే నేను’ వంటి సినిమాలు ఒక కొలిక్కి రాగానే తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయనున్న సంగతి విధితమే. అయితే ఈ సినిమాలో యువ హీరో అల్లరి నరేష్ కూడా నటిస్తున్నారనే వార్త గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లరి నరేష్ ను మీడియా కదిలించగా ఆయన కూడా పలు ఆసక్తికరమైన విశేషాల్ని తెలిపారు.

సినిమా టీమ్ తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్వయంగా చెబుతానని అన్నారు. అలాగే ప్రస్తుతం తాను చేస్తున్న ‘మేడ మీద అబ్బాయి’ షూటింగ్ చివరి దశకు చేరుకుందని, కామెడీతో వస్తున్న ఆ చిత్రం ప్రేక్షకుల్ని తప్పక మెప్పిస్తుందని అన్నారు.