హర్రర్ జానర్‌పై కన్నేసిన యంగ్ హీరో!

nara-rohit-m
’జ్యో అచ్యుతానంద’ సినిమాతో ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మంచి హిట్ కొట్టేసిన నారా రోహిత్, ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న తన సినిమాలన్నింటినీ విడుదలకు సిద్ధం చేసేస్తున్నారు. ఇందులో భాగంగా ‘శంకర’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక ఇవిలా ఉండగానే రోహిత్ తన కొత్త సినిమాను కూడా మొదలుపెట్టేశారు. దసరా పర్వదినం సందర్భంగా నారా రోహిత్ నటించనున్న కొత్త సినిమా ‘భీముడు’ పూజా కార్యక్రమాలతో మొదలైంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమా నారా రోహిత్ ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నింటికీ భిన్నంగా హర్రర్ జానర్లో తెరకెక్కడం విశేషంగా చెప్పుకోవాలి. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రమే చేస్తూ వచ్చిన రోహిత్ మొదటిసారి హర్రర్ వైపు చూస్తూండడం ప్రత్యేకంగా చూడాలి. ప్రస్తుతం తెలుగులో హీరోల మధ్యన పెరిగిపోయిన పోటీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కాలనే నారా రోహిత్ ఈ కొత్త జానర్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‍లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.