భీమిలి వైసీపీ సమరభేరి కి సర్వం ‘సిద్ధం’

భీమిలి వైసీపీ సమరభేరి కి సర్వం ‘సిద్ధం’

Published on Jan 27, 2024 12:53 AM IST

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే వైసిపి  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా పార్టీని సంసిద్ధం చేస్తున్నారు. ఓవైపు ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతూ మరోవైపు కార్యకర్తలకు నేతలకు పార్టీ బలోపేతం పై పలు సూచనలు చేస్తున్నారు. ఇక పలు ప్రాంతాల్లో ప్రస్తుత ఎమ్యెల్యేల యొక్క పని తీరుని బట్టి రానున్న ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికని ప్రారంభించారు. ఈ ఎజండాతో క్యాడర్ ని ఉత్తేజితుల్ని చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరిస్తోంది. 

రానున్న ఎన్నికల సమరానికి సేనలను సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేడు  విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచే సమరశంఖం పూరించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి భారీఎత్తున తరలివెళ్లడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లాలోని విశాఖపట్టణం భువనేశ్వర్‌ జాతీయ రహదారిని ఆనుకొని తగరపువలస మూడు కోవెళ్లు ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు. 

భీమిలి బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లేందుకు ఇప్పటికే సన్నద్ధతపై ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటుచేశారు. వాహనాలు ఏవిధంగా సమకూర్చుకునేదీ, ఎవరెవరూ వెళ్లాలనేదీ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాల నుంచి తరలివస్తున్న దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా ఏవిధంగా, ఏ సమయంలో చేరుకోవాలనేదీ నాయకులకు తెలియజేశారు. ఈ సభ అనంతరం రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తప్పకుండా తాము ప్రవేశపెట్టిన అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రానున్న ఎన్నికల్లో తమకు మేలుని చేస్తాయని వైసిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు