సమీక్ష : అమీర్ పేటలో – కథ బాగున్నా తీసిన విధానం బాగలేదు !

Ameerpetlo review

విడుదల తేదీ : డిసెంబర్ 16, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : శ్రీ

నిర్మాత : ఎం. మహేష్

సంగీతం : మురళి లియోన్

నటీనటులు : శ్రీ, అశ్విని

‘అమీర్ పేటలో’ చిత్రం వెరైటీ ఫోస్టర్లతో, రియలిస్టిక్ కాన్సెప్ట్ తో మంచి ఆసక్తినే కలిగించింది. ఎక్కువభాగం ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్త వారే. కాగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం..

కథ :

ఈ చిత్రం నలుగురు స్నేహితుల జీవితాలకు సంబంధించిన కథ. అప్పుడే వారి చదువులను పూర్తి చేసుకుని నలుగురు స్నేహితులు అమీర్ పేట లో వారి ప్రొఫెషనల్ జీవితాలని ప్రారంభించేందుకు దిగుతారు.

ఆ యువకులు హైదరాబాద్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు చివరకు వారి తప్పులను తెలుసుకుని సమాజానికి ఎలాంటి మంచి చేశారు అనేదే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

నిజ జీవితంలోని కథే కావడంతో ఈ చిత్రం ఆసక్తి కరంగానే ఉంది. కొన్ని అడల్ట్ కామెడీ సన్నివేశాలు తప్ప, తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అమ్మాయిలు ఎలా మారతారనే అంశాన్ని చక్కగా చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కొంత వరకు బావున్నాయి.

ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కొత్త హీరోయిన్ అశ్విని అనే చెప్పాలి. ఆమె లుక్స్ లోనూ, నటన లోనూ మంచి ప్రతిభనే కనబరిచింది. చివర్లో డైరెక్టర్ ఇవ్వాలనుకున్న సందేశం కూడా పర్వాలేదనిపించేలా ఉంది. చిత్రంలో మొదటి భాగం కొన్ని మంచి సన్నివేశాలతో బాగానే గడుస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ప్రధాన డ్రా బ్యాక్ అంటే అది తారాగణమే. హీరో హీరోయిన్లు మినహా మిగిలినవారెవరవూ వారి పాత్రలకు కొంచెం కూడా సరిపోలేదు. ఈ చిత్రం లో ప్రేక్షకులను విసుగు తెప్పించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని ఓవర్ యాక్షన్ సన్నివేశాల వలన చిత్రంలోని మెయిన్ పాయింట్ దెబ్బతినిందనే చెప్పాలి.

ఈ చిత్రంలో బాయ్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేయాలనుకోవడం, ఆమెతో గంటలతరబడి మాట్లాడడం వంటి సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. కొన్ని రియలిస్టిక్ సన్నివేశాలు వస్తున్నాయనుకునే లోపు కొన్ని బోరింగ్ కామెడీ సన్నివేశాలు వచ్చి ఇబ్బంది కలిగిస్తాయి.

చిత్రం ముగిసేటప్పుడు ప్రేక్షకులను సంతృప్తి కలిగించేలా ముగించలేదు. చిత్రం ప్రారంభమయ్యెటప్పుడు హాస్యభరితంగా మొదలవుతుంది. కానీ ముగిసేటప్పుడు దారి మళ్లించి చారిటీ అంటూ ముగిస్తారు. దానికోసం అంత అవసరం ఏం కలిగిందనేది సరిగా చూపించలేదు.

టెక్నికల్ పాయింట్స్ :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కొంత వరకు బాగానే ఉన్నాయి. చిత్రాన్ని సీరియస్ గా ముగించాలనుకున్నా సెకండ్ హాఫ్ లో కొన్ని సిల్లీ సన్నివేశాల వలన అది జరగలేదు. మొదటి అర్ధ భాగం స్క్రీన్ ప్లే బాగానే ఉన్నా రెండవ భాగంలో అది దారితప్పింది. కెమెరా మెన్ పనితనం, కొన్ని డైలాగులు బావున్నాయి.ఈ చిత్రంలో సంగీతం ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది.

ఇక దర్శకుడు శ్రీకాంత్ విషయానికి వస్తే, చిత్ర కథ పరంగా బాగానే ఉన్నా.. చిత్రం లో తారాగణం సరిగా లేకపోవడం, సెకండ్ హాఫ్ రొటీన్ గా ఉండడం వంటి అంశాలు చిత్ర స్థాయిని తగ్గిస్తాయి. ఈ చిత్రాన్నిఆసక్తికరంగా ముగించాలనుకున్నప్పుడు నమ్మశక్యంగా ఉండేలా సన్నివేశాల్ని చిత్రీకరించాల్సింది.

తీర్పు :

‘అమీర్ పేటలో’చిత్రంలో హైదరాబాద్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో జరిగే నిజజీవిత సన్నివేశాల్ని బాగా చూపించారు. కానీ చిత్రాన్ని సందేశాత్మకంగా ముగించాలనుకున్నప్పుడు అదుపు తప్పింది. కొంత మంది యువతకు తప్ప ఈ చిత్రం మిగిలిన వారికి రొటీన్ గా అనిపిస్తుంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :