సమీక్ష : బ్రదర్స్ – మంచి కాన్సెప్ట్ కానీ..

విడుదల తేదీ: 12 అక్టోబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : కె. వి ఆనంద్
నిర్మాత : బెల్లంకొండ సురేష్
సంగీతం: హారీష్ జైరాజ్
నటీనటులు : సూర్య, కాజల్

గజిని, ఆరు, యముడు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు సూర్య. సూర్య అవిభక్త కవలలుగా ద్విపాత్రాభినయంలో, ‘రంగం’ సినిమా ద్వారా ఫేమస్ అయిన డైరెక్టర్ కే.వి ఆనంద్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘మాట్రాన్’. మాట్రాన్ సినిమాని తెలుగులో బ్రదర్స్ పేరుతో డబ్ చేసి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. సూర్య సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాని తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేసారు. ఈ బ్రదర్స్ ఇద్దరు కలిసి ఏం చేసారో ఇప్పుడు చూద్దాం.

కథ :

జెనెటిక్ శాస్త్రవేత్త అయిన రామచంద్ర (సచిన్ ఖేడేకర్) గర్భవతి అయిన తన భార్య మీద చేసిన ప్రయోగం వికటించి ఆమెకు అవిభక్త కవల పిల్లలు విమల్ (సూర్య 1), అఖిల్ (సూర్య 2) పుడతారు. వారిద్దరూ అవిభక్త కవలలుగా ఉండటం రామచంద్రకి ఇష్టం లేకపోయినా భార్య కోరిక మేరకు వారిని అలాగే పెంచుతారు. రామచంద్ర తన జెనెటిక్ ప్రయోగాలూ చేస్తూ ఎనర్జియోన్ అనే మిల్క్ పౌడర్ కనిపెడతాడు. అతి తక్కువ సమయంలోనే ఈ ఎనర్జియోన్ సేల్స్ విపరీతంగా పెరగడంతో మిగతా వారి చూపు ఎనర్జియోన్ పై పడుతుంది. ఎనర్జియోన్ ఎలా తయారు చేస్తారు అనే ఫార్ములా రామచంద్ర నుండి కనిపెట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. అలా ఎనర్జియోన్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్న వారికి అంజలి (కాజల్ అగర్వాల్) కూడా సహాయం చేస్తుంటుంది. అసలు ఈ ఎనర్జియోన్ మిల్క్ పౌడర్ ఫార్ములాలో ఏముంది. దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

ద్విపాత్రాభినయంలో సూర్య చాలా బాగా నటించాడు. విమల్, అఖిల్ రెండు పాత్రల వైవిధ్యం బాగా చూపించగలిగాడు. విమల్ పాత్రకి కార్తి డబ్బింగ్ బావుంది. ఇంటర్వెల్ ముందు అఖిల్ పాత్రలో సూర్య నటన చాలా బావుంది. సెకండాఫ్ లో అఖిల్ పాత్ర మాత్రమే మిగలడంతో సోలో పెర్ఫార్మెన్స్ చేసాడు. కాజల్ కి అంజలిగా పెద్ద పాత్రే దక్కింది. నీవే నీవే, రాణి నన్నే, కొమ్మలన్ని పూవై పాటల్లో చాలా అందంగా ఉంది. కే.వి ఆనంద్ ఆమెని చాలా బాగా చూపించాడు. సూర్య తండ్రిగా నటించిన సచిన్ ఖేడేకర్ విలన్ పాత్రలో బాగా చేసాడు. తెలుగులో చిన్న చిన్న పాత్రలో చేసే రవి ప్రకాష్ కి ఈ సినిమాలో పెద్ద పాత్రే దక్కింది. ఇంటర్వెల్ ముందు ముప్పై నిమిషాల పాటు స్క్రీన్ప్లే వేగంగా ఆసక్తికరంగా సాగింది. ఈ కాన్సెప్ట్ ఎంచుకున్న దర్శకుడు కే.వి ఆనంద్ ని అభినందించి తీరాలి. మన తెలుగు వరకు ఈ రకమైన కాన్సెప్ట్ కొత్త అనే చెప్పుకోవాలి. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన కే.వి ఆనంద్ నీవే నీవే, రాణి నన్నే పాటల చిత్రీకరణ విషయంలో తన పనితనం అంతా చూపించారు.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ విషయానికి వస్తే సూర్య అవిభక్త కవలలు కావడం వల్ల వారి పాత్రల గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికే దాదాపు మొదటి 45 నిముషాలు హరించుకుపోయాయి. దర్శకుడు కూడా వారిద్దరి మీద దృష్టి పెట్టి కథ విషయాన్ని కొద్ది సేపు మర్చిపోయాడు. ఇంటర్వెల్ ముందు కూడా ఇద్దరితో కలిపి చేయించిన ఫైట్ ఓపికకి పరీక్ష పెట్టింది. సెకండాఫ్ లో ఉక్రెయిన్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉన్నా భాష సమస్య ఉన్నప్పుడు సబ్ టైటిల్స్ పెట్టించకుండా కాజల్ తో ఉక్రేనియన్ భాషని తెలుగులో చెప్పించి విసుగు తెప్పించాడు. సెకండాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వల్ల కొంత బోర్ కొడుతుంది. తండ్రి కొడుకుల మధ్య పోరాటం అవడం వల్ల క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. సూర్య, కాజల్ మధ్య ఇన్వెస్టిగేషన్ ట్రాక్ బావుంది కానీ రొమాంటిక్ ట్రాక్ మాత్రం బాలేదు. సెకండాఫ్ మొదలై క్లైమక్స్ వరకు ఇన్వెస్టిగేషన్ మోడ్లో సాగుతూ ఇంట్రస్టింగ్ గా ఉంది కానీ కామెడీ లోపించడం వల్ల ఎంటర్ టైన్మెంట్ ఆశించే వారిని నిరాశపరుస్తుంది.

సాంకేతిక విభాగం :

సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ పాటల్లో మరియు ఉక్రెయిన్ ఎపిసోడ్లో చాలా బావుంది. సినిమాకి పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఎడిటర్ అంటోనీ ఈ మధ్య బాగా మొహమాట పడుతున్నారు. దాదాపు మూడు గంటల సినిమా కావడంతో బాగా బోర్ కొడుతుంది. ఒక 20 నిముషాలు కత్తెర వేస్తే బావుండేది. హారిస్ జై రాజ్ సంగీతంలో 3 పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ పైన కనపడింది.

తీర్పు :

ఎప్పుడు రొటీన్ కాన్సెప్ట్స్ కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ఎంచుకునే సూర్య ఈ సారి కూడా చాల మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. దర్శకుడు కే.వి ఆనంద్ కూడా ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్ తీయడంలో ముందుంటాడు. కాన్సెప్ట్ తెరకెక్కే సమయంలో మాత్రం తడబడ్డారు. హీరో తండ్రే విలన్ కావడంతో క్లైమాక్స్ అస్సలు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మల్టీప్లెక్స్, ఎ క్లాస్ సెంటర్స్ ఆడియెన్స్ వరకు బాగానే ఆకట్టుకుంటుంది, కానీ బి, సి సెంటర్స్ ఆడియెన్స్ మాత్రం ఇలాంటి సినిమాలు ఆదరిస్తారో లేదో చూడాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

అశోక్ రెడ్డి .ఎమ్

Click Here For ‘Brothers’ English Review

సంబంధిత సమాచారం :