సమీక్ష : @నర్తనశాల – కామెడీతో వచ్చినా మెప్పించలేకపోయాడు.

Published on Aug 31, 2018 1:48 am IST

విడుదల తేదీ : ఆగష్టు 30, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు :నాగశౌర్య, యామిని భాస్కర్, జయ ప్రకాష్ రెడ్డి

దర్శకత్వం : శ్రీనివాస్ చక్రవర్తి

నిర్మాతలు : ఉషా మూల్పూరి

సంగీతం : మహతి స్వర సాగర్

స్క్రీన్ ప్లే : శ్రీనివాస్ చక్రవర్తి

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా యామిని భాస్కర్, కశ్మీర పరదేశి హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘@నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందింది. కాగా ఈ చిత్రం ఈ రోజు ఆగష్టు 30న విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
 

కథ :

శివజీ రాజా(కళామందిర్ కళ్యాణ్) తన తండ్రి బతకాలంటే, చనిపోయిన తన తల్లి తనకు కూతురుగా పుట్టాలని బలంగా కోరుకుంటాడు. కానీ అబ్బాయి(నాగ శౌర్య) పుడతాడు. శివాజీరాజా (కళామందిర్ కళ్యాణ్ ) తన తండ్రి ప్రాణాల కోసం, కొడుకును కూతురిలా మార్చి పెంచుతూ ఉంటాడు. దాంతో నాగ శౌర్య చిన్నప్పటి నుంచే ఆడవారి సమస్యలను అర్ధం చేసుకుంటూ పెరుగుతాడు. ఆడవాళ్ళ కోసం సెల్ఫ్ – డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ని కూడా స్టార్ట్ చేస్తూ.. తమను తాము సేవ్ చేసుకున్నే విధంగా అమ్మాయిలకి ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు.

అలా నాగశౌర్య, మానస (కాశ్మీర పరదేశి) సమస్య తీర్చే క్రమంలో ఆమెను ఇష్టపడతాడు. అలాగే నాగశౌర్యని సత్యభామ (యామిని భాస్కర్)ని ఇష్ట పడుతుంది. దీంతో శౌర్య, యామిని లవ్ లో ఉన్నారనుకోని శివాజీ రాజా వారిద్దరూ పెళ్లి ఖాయం చేసేస్తాడు. ఆ పెళ్లి ఆపటానికి నాగశౌర్య ఏం ప్లాన్ వేశాడు ? ఆ క్రమంలో తను ఎదురుకున్న సమస్యలు ఏమిటి ? తనూ ప్రేమించిన మానసకి, జేపీ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి ? అసలు శౌర్య తను ప్రేమించిన మానసను పెళ్లి చేసుకుంటాడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాలసిందే.
 
ప్లస్ పాయింట్స్ :

నాగశౌర్య గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. గే లక్షణాలు ఉన్న పాత్రలో నటించిన శౌర్య ఆ పాత్ర తాలూకు ఎక్స్ ప్రెషన్స్ గాని, మాడ్యులేషన్ గాని చాలా చక్కగా పలికించాడు. తన పాత్రకి ఎదురయ్యే ఇబ్బందికర సంఘటనల ద్వారా అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక కథానాయకిగా నటించిన కశ్మీరా పరదేశి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. అలాగే మరో హీరోయిన్ తెలుగు అమ్మాయి యామిని భాస్కర్ తన అందంతో అభినయంతో బాగా ఆకట్టుకుంది. ఆమె ఇంట్రడక్షన్ సన్నివేశాలు కూడా అలారిస్తాయి.

హీరో తండ్రి పాత్రలో నటించిన శివాజీ రాజా తన కెరీర్ లోనే మరో గుర్తు పెట్టుకున్నే పాత్ర చేశారు. ఆయన తన నటనతో కామెడీ బాగానే పండించారు. ఎప్పటిలాగే అజయ్ తన గాంభీరమైన నతనతో ఆకట్టుకోగా జయ ప్రకాష్ రెడ్డి, సత్యం రాజేష్, రాకెట్ రాఘవ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో బాగా నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
 
మైనస్ పాయింట్స్ :

నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి తన దర్శకత్వంలో నాగశౌర్యని కొత్తగా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అంతగా పండలేదు. దర్శకుడు కథను పేపర్ మీద రాసుకున్నంత అందంగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఆయన కథనం పై ముఖ్యంగా రెండువ భాగం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

రెండువ భాగంలో అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు బాగున్నప్పటకీి కథకు అవసరం లేని సీన్స్ తో కథనం నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో చాలా వరకు కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తోంది. పైగా స్క్రీన్ ప్లే కూడా రెగ్యూలర్ గా సినిమాలు చూసే ప్రేక్షకులకి చాలా ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తోంది.
 
సాంకేతిక విభాగం :

దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి కామెడీని పండించే ప్రయత్నం చేసినా, అయన పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు

విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య సాగిన సన్నివేశాల్లో కెమెరా బాగుంది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ ఛలో చిత్రానికి ఇచ్చిన హిట్ ఆల్బమ్ స్థాయిలో ఈ చిత్రానికి ఆల్బమ్ ఇవ్వలేకపోయినప్పటికీ కొన్ని పాటలు పర్వాలేదనపిస్తాయి. అలాగే స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి అనుగుణంగానే సాగుతుంది.

సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ పనితనం ఈ సినిమాకి ప్లస్ అయింది. కానీ అక్కడక్కడ తగిలే కథకు అత్యవసరం కాని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని నిర్మాత ఉషా మూల్పూరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
 
తీర్పు:

ఛలో లాంటి మంచి విజయంతో మొదలైన ఐరా క్రియేషన్స్ ఆ విజయ పరంపరను కొనసాగించిలేకపోయింది. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా యామిని భాస్కర్, కశ్మీర పరదేశి హీరోయిన్లుగా రూపొందిన ‘@నర్తనశాల’ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో వచ్చినప్పటికి నెమ్మదిగా సాగే కథనం, బలమైన భావోద్వేగాలు పండించే సన్నివేశాలు లేకపోవడం, ఉన్న ఎమోషన్ కూడా ఫేక్ ఎమోషన్ లా అనిపించడం.. ఓవరాల్ గా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. కానీ సినిమాలోని కొన్ని కామెడీ సన్నివేశాలు బి.సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు. మొత్తం మీద మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సంతృప్తికరంగా లేదనే చెప్పాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :

X
More