సమీక్ష : ‘నాతో నేను’ – కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకునే లైఫ్ జర్నీ

Natho Nenu Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 21, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సాయికుమార్‌, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి. ఐశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌, రాజీవ్‌ కనకాల, సమీర్‌, సివిఎల్‌ నరసింహరావు, గౌతంరాజు, భద్రమ్‌, సుమన్‌ శెట్టి తదితరులు.

దర్శకుడు : శాంతికుమార్‌ తూర్లపాటి

నిర్మాత: ప్రశాంత్‌ టంగుటూరి

సంగీతం: సత్య కశ్యప్‌

బ్యాగ్రౌండ్‌ స్కోర్‌: ఎస్‌ చిన్నా

సినిమాటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి

ఎడిటర్: నందమూరి హరి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

శాంతికుమార్‌ తూర్లపాటి దర్శకత్వంలో సాయికుమార్‌, ఆదిత్యా ఓం, శ్రీనివాస్‌ సాయి, ఐశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌ కీలక పాత్రధారులు రూపొందిన చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ:

60 ఏళ్ల వయసులో తన జీవితంలో ఉన్నతస్థానంలోకి వెళ్లిన కోటీశ్వరరావు (సాయికుమార్‌) కొన్ని సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అయితే, ఓ నాటకీయ సంఘటన కారణంగా ఓ స్వామిజీ కోటీశ్వరరావుకి ఓ వరమిస్తాడు. ఇంతకీ ఆ వరం ఏమిటి ?, ఆ వరం తర్వాత కోటీశ్వరరావు జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది ?, ఇంతకీ, 20 ఏళ్ల కోటిగాడు(సాయి శ్రీనివాస్‌) దీప (ఐశ్వర్య)తో ప్రేమ ఎలా సాగింది ?, అలాగే ఓ మిల్లులో పని చేసే 40 ఏళ్ల కోటిగాడు (ఆదిత్య ఓం) – నాగలక్ష్మి (దీపాలి) మధ్య ఏం జరిగింది ?, అసలు ఈ ఇద్దరి కోటిగాళ్లకు ఆ కోటీశ్వరరావుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన కోటీశ్వరరావు పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్స్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన కీలక పాత్రలు.. ఆ పాత్రలతో కోటీశ్వరరావు జర్నీ ఇలా మొత్తానికి ‘నాతో నేను’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా లవ్ టోన్ తో సాగే ఎమోషనల్ సీన్స్ అండ్ మిగిలిన సీక్వెన్స్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రగా నటించిన సాయి కుమార్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు. కోటీశ్వరుడిగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా, తన గత జీవితం తాలూకు బాధలను అనుభవిస్తున్న వ్యక్తిగా సాయికుమార్‌ నటన చాలా బాగుంది.

అలాగే, మరో ప్రధాన పాత్రలో నటించిన ఆదిత్య ఓం కూడా చాలా బాగా నటించాడు. తను ఇష్డపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుని చివరకు మోసపోయే పాత్రలో ఆదిత్య ఓం చక్కగా నటించాడు. సాయి శ్రీనివాస్‌ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. మొత్తానికి మూడు కీలక పాత్రల నడుమ సాగిన ఈ కథలో మెయిన్ పాయింట్ ఆకట్టుకుంది. అలాగే ఐశ్వర్య, దీపాలి రాజ్‌పుత్‌ లతో సహా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు శాంతికుమార్‌ తూర్లపాటి మంచి కథాంశం తీసుకున్నా.. దర్శకుడిగా ఆయన ఫెయిల్ అయ్యారు. జీవితానికి మరియు డబ్బుకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు శాంతికుమార్‌ మాత్రం ఎక్కడా ఆ దిశగా సినిమాని మలచలేదు.

కానీ, సినిమాలో చెప్పాలనుకున్న థీమ్ బాగుంది. కానీ, ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. మొత్తమ్మీద బోరింగ్ సీన్స్ తగ్గించి.. మేకింగ్ అండ్ టేకింగ్ పై మేకర్స్ మరింత శ్రద్దగా దృష్టి పెట్టి ఉండి ఉంటే.. ఈ సినిమా బెటర్ గా ఉండేది. మెయిన్ గా ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చూసుకుంటే.. ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. సినిమాలోని కొన్ని కీలక దృశ్యాలను కెమెరామెన్ సమర్ధవంతంగా చిత్రీకరించాడు. సత్య కశ్యప్‌ అందించిన సంగీతం విషయానికి వస్తే.. సంగీతం ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో ఎస్‌ చిన్నా ఇచ్చిన నేపధ్య సంగీతం బాగుంది. ఎడిటర్ నందమూరి హరి బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాత ప్రశాంత్‌ టంగుటూరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

‘నాతో నేను’ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కథాంశంతో పాటు ఓ సగటు వ్యక్తి తాలూకు లైఫ్ జర్నీ, అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథనం ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మరియు లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాకపోయినా.. సినిమాలోని సందేశం మాత్రం కనెక్ట్ అవుతుంది.

 

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :