సమీక్ష : ఆఫీసర్ – నాగార్జున తన డ్యూటీ చేశాడు కానీ..

Officer movie review

విడుదల తేదీ : జూన్ 01, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నాగార్జున, మైరా సరీన్

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

నిర్మాత : రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర

సంగీతం : రవి శంకర్

సినిమాటోగ్రఫర్ : రాహుల్ పెనుమత్స

ఎడిటర్ : అన్వర్ అలీ

స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ

‘శివ’ సినిమాతో నాగార్జునకు తిరుగులేని విజయాన్ని అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . చాలా రోజుల తరువాత నాగార్జున, వర్మల కలయికలో రూపొందిన చిత్రం ‘ఆఫీసర్’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఆఫీసర్ ఎలా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం.

కథ :
వరుస ఎంకౌంటర్ల నేపథ్యంలో ముంబై పోలీస్ ఆఫీసర్ నారాయణ పసారి ఫై కోర్టు విచారణకు సిట్ ను నియమిస్తుంది. ఈ సిట్ కు హెడ్ గా హైదరాబాద్ కు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ శివాజీరావు (నాగార్జున )ను నియమిస్తుంది. పసారి ఒక చేత్తో మాఫియాను అంతమొందిస్తూనే మరో పక్క డబ్బుల కోసం కాంట్రాక్టు కిల్లింగ్ చేస్తుంటాడు.

శివాజీరావు విచారణ చేప్పట్టిన తరువాత పసారిని అరెస్ట్ చేసినా సాక్ష్యాలు లేనందున ఆ కేసును కొట్టివేయడం జరుగుతుంది. తన అరెస్ట్ తో కలత చెందిన పసారి కంపనీ అనే మాఫియాను తయారు చేస్తాడు. ఈ కంపెనీని, పసారిని శివాజీ రావు ఎలా పట్టుకుంటాడు అనేదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మొదటిగా చెప్పుకోవాల్సింది హీరో నాగార్జున గురించి. తన నటనతో సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశారాయన. సినిమాలో చాలా ఫిట్ గా కనిపిస్తూ నటుడిగా తన డ్యూటీ తాను సక్రమంగా చేసి అగ్రెసివ్ పోలీసాఫిసర్ పాత్రకు న్యాయం చేశారు.

నాగార్జున కూతురిగా కనిపించిన బేబీ కావ్య చక్కగా నటించింది. ఆమెకు నాగార్జునకు మధ్యన నడిచే తండ్రి కూతుళ్ళ తాలూకు ఎమోషనల్ ట్రాక్ బాగుంది. సినిమా ఫస్టాఫ్ ను ముంబై పోలీస్ వ్యవస్థ బ్యాక్ డ్రాప్లో సెట్ చేసి, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో కొంత ఆసక్తికరంగా నడిపారు రామ్ గోపాల్ వర్మ.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంచుకున్న లైన్ ఆసక్తిగా ఉన్నా దాన్ని ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ గా మలచలేకపోయారాయన. మొదటి భాగంలో కథను ఆసక్తిగా స్టార్ట్ చేసి రెండో భాగం మొత్తాన్ని తనకు తోచినట్టు తీసుకుంటూ వెళ్ళిపోయారు. డ్యూటీ నుండి తొలగింపబడిన విలన్ మళ్ళీ డ్యూటీలో చేరడం, హీరోను తన టీంలో సభ్యుడిగా చేసుకోవడం వంటి అంశాలను ఆకక్తికరంగా చూపిచలేకపోయారు. ముఖ్యంగా ఆర్జీవీ సినిమాల్లో ఉండే క్రైమ్ డ్రామా ఇందులో అస్సలు కనబడలేదు.

సినిమాకు మరొక పెద్ద డ్రాబ్యాక్ ప్రతినాయకుడి పాత్ర. ఆ పాత్ర బలహీనంగా ఉండటమేగాక ఆందులో నటించిన నటుడు కూడ ఏ ఒక్క సన్నివేశంలోనూ నాగార్జునకు ధీటుగా నిలబడలేకపోయారు. ఆ పాత్రలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న నటుడ్ని తీసుకుని ఉంటే బాగుండేది.

ఇక చివర్లో హీరో, విలన్ కి మధ్య ఫైట్ సీన్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో కథను తయారుచేసుకున్నప్పుడు మాఫియా ప్రభావం ప్రజల మీద ఎంత ఉంది లాంటి అంశాలను చూపెట్టాలి కానీ సినిమాలో అలాంటి తీవ్రమైన అంశాలేవీ కనబడవు.

సాంకేతిక విభాగం :

సినిమాను తక్కువ బడ్జెట్లోని తీసినా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. వర్మ కెమెరాతో పెద్దగా ప్రయోగాలు చేయకపోవడంతో విజువల్స్ బాగానే వచ్చాయి. చిత్రాన్ని ముంబై బ్యాక్ డ్రాప్లో సెటప్ చేసిన విధానం, రియలిస్టిక్ లొకేషన్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగానే ఉంది.

ఇక వర్మ విషయానికొస్తే దర్శకుడిగా ఆయన తన పనిని సగం వరకే చేశారు. కథను ఆసక్తికరంగానే మొదలుపెట్టిన అయన పోను పోను ఆ ఆసక్తిని నీరుగార్చేశారు. ఎప్పుడూ పాత్రలకి సరైన నటుల్ని ఎంచుకునే ఆయన ఈసారి మాత్రం ప్రతినాయకుడి పాత్రకు న్యాయం చేయలేని నటుడ్ని తీసుకుని నిరుత్సాహానికి గురిచేశారు. సినిమాలోని సౌండ్ ఎఫెక్స్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తీర్పు :

మొత్తం మీద కాన్సెప్ట్ బాగానే ఉన్న దాన్ని సినిమాగా తీయడంలో మాత్రం వర్మ విఫలమయ్యారు. విలన్ పాత్ర సరిగా లేకపోవడం, హీరోకి విలన్ కి మధ్యన జరిగే ఘర్షణ సన్నివేశాలు బలహీనంగా ఉండటం సినిమా ఫ్లోను దెబ్బతీశాయి. సినిమా మరీ బాగోలేదని చెప్పలేం కానీ సరిగాలేని కథనమే ఫలితాన్ని తారుమారు చేసిందనోచ్చు. నాగార్జున యొక్క సిన్సియర్ నటన తప్ప ఈ సినిమా నుండి పొందగలిగిన వేరే అంశాలేవీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కాలం తర్వాత పోలీస్ పాత్ర ధరించిన నాగార్జున అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ ను చూడాలనుకునే వాళ్ళకు తప్ప మిగతా వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :