సమీక్ష : స్కెచ్ – సరిగా వేయలేదు

Sketch movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : విక్రమ్, తమన్నా

దర్శకత్వం : విజయ్ చందర్

నిర్మాత : మూవింగ్ ఫ్రేమ్

సంగీతం : ఎస్. థమన్

సినిమాటోగ్రఫర్ : ఎం. సుకుమార్

ఎడిటర్ : రూబెన్

చియాన్ విక్రమ్, తమన్నాలు జంటగా నటించిన చిత్రం ‘స్కెచ్’. తమిళంలో ఇది వరకే రిలీజైన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత తెలుగులో ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

స్కెచ్ (విక్రమ్) వాయిదాలు కట్టని బైకులను, కార్లను ఎత్తుకొచ్చి డబ్బులు వసూలు చేసే దందాలో ముఖ్యుడుగా ఉంటాడు. కొన్నేళ్ల క్రితం ఒక రౌడీ తన యజమాని దగ్గర డబ్బు తీసుకుని కారు కొని వాయిదాలు ఎగ్గొడతాడు. దాంతో యజమాని స్కెచ్ ను ఆ కారును ఎత్తుకు రమ్మని చెప్తాడు.

యజమాని మాట మేరకు స్కెచ్ ఆ కారుని ఎత్తుకొస్తాడు. దాంతో కక్ష కట్టిన ఆ రౌడీ స్కెచ్ ను, అతని ముగ్గురు స్నేహితుల్ని చంపాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకున్న రౌడీ వాళ్ళను ఎలా చంపాడు, ఆ రౌడీ పై స్కెచ్ ఎలా పగ తీర్చుకున్నాడు, చివరికి స్కెచ్ జీవితం ఏమైంది అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ సెకండాఫ్. ఇందులోనే అసలు కథ మొదలవుతుంది. హీరో రౌడీతో గొడవ పెట్టుకోవడం, రౌడీ అతని స్నేహితుల్ని టార్గెట్ చేయడం, హీరో విలన్ ను చంపడానికి స్కెచ్ వేయడం, దాన్ని అమలుపరచడం వంటి ముఖ్య అంశాలు ఇందులోనే ఉంటాయి. వీటి తాలూకు సన్నివేశాల్లో కొన్ని బాగానే ఉంటాయి కూడ. ఇంటర్వెల్ ముందు హీరో రౌడీ కారును దొంగిలించే సీన్ బాగుటుంది.

అలాగే చిత్ర క్లైమాక్స్ అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. అందరికీ స్కెచ్ వేసే హీరోకే కొందరు అనూహ్య రీతిలో స్కెచ్ వేయడం, దాన్ని అమలుపరచడం కొంత థ్రిల్ చేస్తుంది. ఈ అంశంతో ముడి పెట్టి దర్శకుడు ఇచ్చిన సామాజిక సందేశం కూడ కొంత ఆలోచింపజేస్తుంది. ఇక విక్రమ్ తన సహజ నటనతో చాలా చోట్ల ఇంప్రెస్ చేయగా యాక్షన్ సన్నివేశాలు, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో కొత్తది అనదగిన కథ లేకపోవడమే పెద్ద మైనస్. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం నడిచిన ఫార్మాట్ ను తీసుకుని విజయ్ చందర్ రాసుకున్న కథ, కథనాలు చాలా పాతవిగా, విసిగించేవిగా ఉన్నాయి. సినిమా మొత్తంలో ఒక్క క్లైమాక్స్ మినహా మరే అంశమూ థ్రిల్ చేయలేకపోయింది. కనీసం దర్శకుడు బాగుందనిపించిన ముగింపుకు, సామాజిక సందేహానికి తగ్గట్టే మొదటి నుండి సినిమాను నడిపి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది.

కానీ అలా చేయకపోవడంతో ఉన్నట్టుండి ఊడిపడే ముగింపును ప్రేక్షకులకు ఎంజాయ్ చేసినా సంపూర్ణంగా ఆమోదించలేరు. మధ్యలో నడిచే లవ్ ట్రాక్ తలా, తోక లేకుండా ఉండటంతో ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో అర్థమే కాదు. కనీసం విక్రమ్, తమన్నాల మధ్యన రొమాన్స్ అయినా ఉందా అంటే అదీ లేదు.

ఇక టైటిల్ సాంగ్ తో మొదలుడితే చివరి వరకు వచ్చే పాటల్లో ఒక్కటంటే ఒకటి కూడ ఇంప్రెస్ చేయలేకపోయింది. మొదటి అర్థ భాగం మొత్తంలో విక్రమ్ స్టార్ డమ్, నటనా స్థాయికి సరితూగే సన్నివేశం ఒక్కటీ కనిపించదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు విజయ్ చందర్ పాత తరహా కథ, విసిగించే స్క్రీన్ ప్లేతో చిత్రాన్ని పెద్దగా ఆకట్టుకోని విధంగా తయారుచేశారు. ఒక్క క్లైమాక్స్ విషయంలో తప్ప ఎక్కడా దర్శకుడ్ని మెచ్చుకునే ఆస్కారం దొరకలేదు. కనీసం ఆయన స్టార్ ఇమేజ్ ఉన్న విక్రమ్ పాత్రనైనా అభిమానులు మెచ్చుకునే విధంగా తీర్చిదిద్ది స్క్రీన్ పై చూపించి ఉంటే బాగుండేది.

థమన్ ఇచ్చియాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటలు సంగీతం అస్సలు బాగోలేదు. ఎడిటింగ్ ద్వారా సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను చాలా వాటిని కత్తిరించాల్సింది. ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ బాగేనా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

తమిళంలో పరాజయం పొందిన ఈ ‘స్కెచ్’ తెలుగులో కూడ పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయింది. కొంత సెకండాఫ్, థ్రిల్ చేసే క్లైమాక్స్, సోషల్ మెసేజ్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా దర్శకుడు విజయ్ చందర్ రాసుకున్న పాతదైన కథ, కథనాలు పేలవమైన సన్నివేశాలు బోర్ కొట్టించేవిగా, విక్రమ్ స్థాయికి సరితూగని విధంగా ఉండటం నిరుత్సాహానికి గురిచేస్తాయి . మొత్తం మీద దర్శకుడు సరిగా వేయలేకపోయిన ఈ స్కెచ్ కొత్తదనాన్ని, ఎంటర్టైన్ చేయగల కంటెంట్ ను ఆశించేవారిని పెద్దగా సంతృప్తి పరచదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :