సమీక్ష : ‘వలిమై’ – ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే !

సమీక్ష : ‘వలిమై’ – ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే !

Published on Feb 25, 2022 3:02 AM IST
Valimai Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అజిత్ కుమార్, కార్తికేయ, హుమా ఖురేషి, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప

దర్శకత్వం : హెచ్ వినోద్

నిర్మాత: బోనీ కపూర్

సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ: నీరవ్ షా

ఎడిటర్ : విజయ్ వేలుకుట్టి


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వలిమై”. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ:

వైజాగ్ లో సైతాన్ అనే బ్యాచ్ డ్రగ్స్ దందా, వరుస చైన్ స్నాచింగ్ లు, హత్యలు చేస్తూ ఉంటారు. వరుస దోపిడీలు దాడులతో వైజాగ్ ప్రజలు బాధలు పడుతూ ఉంటారు. ఈ క్రమంలో వైజాగ్ కి వస్తాడు పోలీస్ ఆఫీసర్ అర్జున్ (అజిత్ కుమార్). ఇంతకీ అర్జున్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు ? అసలు ఈ సైతాన్ బ్యాచ్ వెనుక ఉన్న లీడర్ ఎవరు ? ఈ బ్యాచ్ కి నరేన్ (కార్తికేయ)కి ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు అర్జున్ సైతాన్ బ్యాచ్ కి ఎలా ముగింపు పలికాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రం నేపథ్యం చాలా బాగుంది. స్క్రిప్ట్ లో చాలా మంచి మాస్ ఎలిమెంట్స్ కుదరడం అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తగినంత కమర్షియల్ అంశాలతో పర్ఫెక్ట్ గా ప్యాక్ చేసారు, ఇదే ఆడియన్స్ ను బాగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మాస్ ఎలివేషన్స్, ఫైట్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు ఇలా అన్ని బాగున్నాయి.

ఇక అజిత్ కుమార్ తని బాడీ లాంగ్వేజ్ మరియు మాస్ అవతార్ లో ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. చాలా కాలం తరువాత, రేసింగ్ సీన్స్ లో కూడా చాలా బాగా చేశాడు. ఇక సినిమాలోని క్రేజీ బిజిఎం, స్టంట్స్ చాలా బాగున్నాయి. కార్తికేయ నటన ఈ చిత్రానికి మరో అదనపు బోనస్.

కానీ ఈ చిత్రం మెయిన్ ప్లస్ పాయింట్ అజితే. అజిత్ తో కార్తికేయ రేసింగ్ సన్నివేశాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక హుమా ఖురేషి మంచి సినిమాతోనే సౌత్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె మాత్రం కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయిపొయింది. అయినా ఆకట్టుకుంది.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు హెచ్ వినోద్ తీసుకున్న మెయిన్ పాయింట్, మరియు ప్రధాన పాత్రలు, ఆ పాత్రల తాలూకు సంఘర్షణ బాగా ఆకట్టుకున్నా… సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. పైగా కథను ఎలివేట్ చేస్తూ దర్శకుడు వినోద్ రాసుకున్న సీరియస్ ట్రీట్మెంట్ కొన్ని చోట్ల లాజికల్ గా ఉండి ఉంటే బాగుండేది.

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించుకొని ఉండి ఉంటే, సినిమాకి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది. అయితే మెయిన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని సీన్స్ స్లోగా ఉండటం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం, బోరింగ్ గా సాగే తల్లి సెంటిమెంట్ వంటి అంశాలు సినిమాకి బలహీనతలు గా నిలిచాయి.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అయితే, యాక్షన్ సీన్స్ లో యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది గాని, సెకండ్ హాఫ్ ను ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సన్నివేశాలలోని విజువల్స్ ను నీరవ్ షా చాలా సహజంగా చూపించారు. నిర్మాత బోనీ కపూర్ పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

 

తీర్పు :

పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాకెడ్ తో పక్కా క్రైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ కంటెంట్, అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అజిత్ నటన సినిమాలోనే హైలైట్ గా నిలిచింది. కాకపోతే కొన్ని సీన్స్ బోర్ గా సాగడం, మరియు సెకండాఫ్ ప్లే కొన్ని చోట్ల ఆసక్తికరంగా సాగకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా అజిత్ అభిమానులతో పాటు యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది.

 

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు