విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం హైదరాబాద్‌లో థాంక్యూ మీట్ నిర్వహించింది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించగా, ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు కీలక పాత్రలోనూ నటించారు.
ఈ కార్యక్రమంలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. వారం మొదట్లోనూ సినిమాకు ప్రేక్షకుల స్పందన బాగుందని, నటీనటుల నటనకు ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. సినిమాను 200 థియేటర్లలో విడుదల చేశామని నిర్మాత కాండ్రేగుల నాయుడు చెప్పారు. ఆదరణ బాగున్నప్పటికీ ఇతర చిత్రాల వల్ల తగినన్ని థియేటర్లు దక్కడం లేదని, తమ చిత్రానికి మరిన్ని థియేటర్లు కేటాయించాలని డిస్ట్రిబ్యూటర్లను కోరారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ, సినిమాను చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, ఇలాంటి చిత్రాలకు మరిన్ని థియేటర్లు ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ, రివ్యూల్లో వచ్చిన ప్లస్, మైనస్ అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, క్రమంగా సినిమాకు థియేటర్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, దసరా సీజన్‌లో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.


