ఇంటర్వ్యూ : అనిల్ సుంకర – మా ‘కిరాక్ పార్టి’ చిత్రం ‘శివ, హ్యాపీ డేస్’లకు దగ్గరగా ఉంటుంది !
Published on Mar 12, 2018 4:54 pm IST


నిర్మాత అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన తాజా చిత్రం ‘కిరాక్ పార్టి’. నిఖిల్ హీరోగా శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలకానుంది. ఈ సందర్బంగా అనిల్ సుంకర మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నారా ?
జ) అవును. ఎందుకంటే సినిమా అనుకున్నట్టే వచ్చింది కాబట్టి. ఎలాంటి ఔట్ ఫుట్ రావాలనుకున్నామో అలాంటి ఔట్ ఫుట్ వచ్చింది. తీయగలిగినంతలో మంచి సినిమా తీశాం. అందుకే నమ్మకంగా ఉన్నాను.

ప్ర) ‘కిరిక్ పార్టి’ని రీమేక్ చేయడానికి ప్రధాన కారణం ?
జ) నాకు ఎప్పటి నుండో ‘శివ’ లాంటి సినిమా చేయాలని ఆశ. ‘కిరిక్ పార్టి’ కంటెంట్ దానికి ఎంతో కొంత దగ్గరగా ఉండటంతో దాన్ని రీమేక్ చేశాను.

ప్ర) ముందుగా దర్శకుడు రాజుసుందరం అనుకున్నారు కదా.. ఆయనేందుకు తప్పుకున్నారు ?
జ) అవును. ముందు రాజుసుందరం అనుకున్నాం. కానీ ఆయన తెలుగు, తమిళం రెండు భాషల్లో చేద్దాం అన్నారు. కానీ రెండు భాషల్లో ఒకేసారి అంటే ఫోకస్ చేయలేమని వద్దనుకున్నాం. ఆ తర్వాత అప్పటికే సినిమాకి పనిచేస్తున్న శరన్ కొప్పిశెట్టికి అవకాశం ఇచ్చాను.

ప్ర) సుదీర్ వర్మ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు ?
జ) సినిమాను నిఖిల్ కు చూపించేప్పుడు సుధీర్ వర్మ, చందూ మొండేటిని కూడ తీసుకువచ్చాడు. వాళ్ళు కూడ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యారు. శరన్ వాళ్ళ దగ్గర గతంలో పనిచేసి ఉండటంతో దగ్గర్నుండి ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తామని అన్నారు.

ప్ర) సినిమాను మీరే రిలీజ్ చేస్తున్నారా ?
జ) 90 శాతం వరకు మేమే రిలీజ్ చేస్తున్నాం. మిగతాది వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ప్ర) సినిమా రన్ టైమ్ ఎంతవరకు తగ్గించారు ?
జ) ఒరిజినల్ వెర్షన్ 2 గంటల 45 నిముషాలు ఉంటుంది దాన్ని మన వాళ్ల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసి 2గంటల 25 నిముషాలకు కుదించాం. రెండు పాటలను తీసేస్తే ఇంకా 8 పాటలు మిగిలాయి.

ప్ర) మీకు దర్శకుడిగా ఉండటం ఇష్టమా లేక నిర్మాతగా ఉండటం ఇష్టమా ?
జ) నేను దర్శకుడిని అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ విఫలమయ్యాను. నిర్మాతగా సక్సెస్ అయ్యాను. కాబట్టి నిర్మాతగా ఉండటమే ఇష్టం.

ప్ర) కొత్తవాళ్ళనే ఎక్కువగా తీసుకోవడానికి కారణం ?
జ) ఎందుకంటే రెమ్యునరేషన్ తక్కువ కాబట్టి (నవ్వుతూ). అన్నిటికీ మించి సినిమాలో ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది కాబట్టి కొత్త వాళ్లను తీసుకున్నాను.

ప్ర) శర్వానంద్ తో సినిమా చేస్తున్నారని విన్నాం ?
జ) అనుకున్నాం. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. స్టోరీ పనులు జరుగుతున్నాయి. ముందుగా దర్శకుడిగా ‘దండుపాళ్యం’ డైరెక్ట్ చేసిన శ్రీనివాసరాజుగారు అనుకున్నాం. స్టోరీ పూర్తయ్యాక ఫైనల్ చేస్తాం.

ప్ర) ‘కిరాక్ పార్టి’లో ముఖ్యమైన అంశం ఏంటి ?
జ) చాలా మంది కుర్రాళ్ళు పల్లెటూరి నుండి ఇంజనీరింగ్ చేయడానికి వస్తారు. మొదటి సంవత్సరంలో చాల భయంభయంగా ఉండే ఆ కుర్రాళ్ళు సెకండ్ ఇయర్ కి వచ్చేప్పటికి కొంత మారరుతారు. చివరి సంవత్సారానికి వచ్చేప్పటికి పూర్తిగా మారిపోతాడు. దీన్ని ఇంతకుముందు ఏ సినిమాలో కూడ పూర్తిగా చూపించలేదు. కానీ మా సినిమాలో చూపించాం. అదే ఈ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్.

 
Like us on Facebook