బాలయ్య సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ !
Published on Oct 15, 2017 8:22 pm IST

నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ నయనతార, మలయాళ నటి నటాషా దోషిలు నటిస్తుండగా తాజాగా మరొక నటిని కూడా ఇందులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆమె మరెవరో కాదు హరి ప్రియ. తెలుగులో ‘పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, తకిట తకిట, గలాట’ వంటి సినిమాల్లో నటించిన ఆమె గత రెండేళ్లుగా తెలుగు సినిమాలు మాని ఇతర దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. ఈమెనే బాలయ్య సరసన మూడో హీరోయిన్ గా తీసుకున్నారని, ఆమె షూట్లో కూడా జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రం ఆమెకు తెలుగులో రీ ఎంట్రీ అనే అనాలి.

మరోవైపు మరొక పాపులర్ హీరోయిన్ రెజీనాను కూడా ఒక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు వార్తలొస్తున్నాయి. చిరంతన్ భట్ సంగీతాన్ని అందివ్వనున్న ఈ చిత్రంలో మురళీ మోహన్, జగపతిబాబు, బ్రహ్మానందం వంటి ప్రముఖులు కూడా నటిస్తున్నారు.

 
Like us on Facebook