ఇంటర్వ్యూ – సమంత : ఏఎన్అర్ గారి సెన్స్ అఫ్ హుమౌర్ అద్భుతం

ఇంటర్వ్యూ – సమంత : ఏఎన్అర్ గారి సెన్స్ అఫ్ హుమౌర్ అద్భుతం

Published on May 23, 2014 9:00 AM IST

 

samantha

అక్కినేని కుటుంబం నుండి మూడు తరాల హీరోలు నటించిన సినిమా ‘మనం’. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది, ఇది ఒక ఆణిముత్యం అని స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావు గారికి ఇంతకంటే గొప్ప నివాళి ఉండదని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించిన సమంతతో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) ‘మనం’ సినిమాలో మీ పాత్ర గురించి మీ మాటలలో?

స) ఈ సినిమాలోని పాత్ర వేరే ఎవరైనా చేసి ఉంటే, నేను చాలా భాధపడేదాన్ని. ఈ సినిమాలో నాది ఒక మంచి క్యారెక్టర్, ఇలా అక్కినేని కుటుంబం నుండి మూడు తరాల నటులతో నటించే అవకాశం ఇంకెప్పుడు ఎవరికీ రాదు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా దర్శకుడు విక్రమ్ గారికి ధన్యవాదాలు.

ప్ర) స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ఏమైనా చెబుతారా?

స) నాగేశ్వర్ రావు గారి గురించి మాట్లాడే అంత అర్హత నాకు లేదు. ‘ఏమాయ చేశావే’ సినిమా సక్సెస్ మీట్ లో ఆయనను నేను తొలి సారి కలిసాను, అప్పుడు అయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ని నేను ఎప్పుడు మరచిపోలేను. నేను ఎప్పుడైనా భాధలో ఉంటే అయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ని యూ ట్యూబ్ లో చూసి స్పూర్తి పొందుతాను. అయనతో పని చేయడం నిజంగా నా అదృష్టం, ఏఎన్అర్ గారితో నాకు ఉన్నవి మూడు నాలుగు సన్నివేశాలే అయినప్పటికీ అద్భుతంగా అనిపించింది. అయనకున్న సెన్స్ అఫ్ హుమౌర్ తో అందర్ని నవిస్తూనే ఉంటారు.

ప్ర) ఇంత మంది మహా నటులతో పని చేయడం ఏలా అనిపించింది?

స) నాకు ఈ సినిమాలో ముగ్గురు నటులతో కలిసి పని చేసే అవకాశం దక్కింది. వాళ్ళ నటనతో పోటి పడుతూ చేశాను.

ప్ర) అనూప్ రూబెన్స్ సంగీతం గురించి ఏమైనా చెబుతారా?

స) అనూప్ రూబెన్స్, నాకు ‘కింగ్ అఫ్ మేలోడీస్’ లా అనిపిస్తాడు. ఈ సినిమా పాటలు అద్భుతంగా వచ్చాయి. నాకు ఇష్టమైన పాట ‘అమ్మ’ పాట.

ప్ర) దర్శకుడు విక్రమ్ తో పనిచేయడం ఏలా అనిపించింది?

స) విక్రమ్, ఒక డిమాండింగ్ డైరెక్టర్, ఎక్కడ రాజీ పడడు. కానీ రాజమౌళి, గౌతం మేనన్ లతో పని చేసాక అది నాకు అలువాటు అయిపోయింది. అలాంటి నటనను నా నుండి రాబట్టుకుంటే నాకే మంచిది అని నా అభిప్రాయం.

ప్ర) మీకు గ్లామర్ పాత్రలు చేయడం ఇష్టమా, లేక పెర్ఫార్మన్స్ రోల్స్ చేయడం ఇష్టమా?

స) నాకు గ్లామర్ కంటే నటించడం అంటేనే ఎక్కువ ఇష్టం. గ్లామర్ పాత్రలు చేయడం కంటే, మంచి పెర్ఫార్మన్స్ పాత్రలే సునాయాసంగా చేస్తాను.

ప్ర) మీ దృష్టిలో ‘మనం’ సినిమాలో అక్కినేని కుటుంబంలో ఎవరు మంచిగా నటించారు?

స) వారి నటన గురించి కంటే, వాళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు చూడడం చాలా అద్భుతంగా అనిపించేది. తాత, కొడుకు, మనుమడు ఇలా మూడు తరాల వారు కూర్చొని మాట్లాడుకుంటుంటే, జోక్స్ వేసుకుంటుంటే ఆ కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటగా అనిపించేది.

ప్ర) ఈ సినిమా ఒప్పుకోడానికి గల కారణం?

స) నేను ఏ సినిమా అయిన దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోన్నాకే ఒప్పుకుంటా, కానీ ఈ సినిమా మాత్రం స్క్రిప్ట్ విన్న వెంటనే ఒప్పుకున్నాను. అక్కినేని కుటుంబం ఈ సినిమా చేయకపోయినా నేను ఈ సినిమా చేసేదాన్ని, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మీద నాకు అంత నమ్మకం ఉంది.

ప్ర) శ్రీయతో పని చేయడం ఏలా అనిపించింది?

స) నేను ఆమె నటించిన చాలా సినిమాలు చూసాను, కానీ ఈ సినిమాలో ఆమె చాలా అందంగా కనిపిస్తూ తన నటనతో అలరించింది. శ్రీయతో పని చేయడం మంచిగా అనిపించింది, ఈ సినిమాకి ఆమెకు మంచి పేరు వస్తుంది.

ప్ర)మీరు చేసిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది?

స) నా సినిమాలకు నేను మొదటి విమర్శకురాలిని, మీడియా అంతా, నా నటనను పొగిడిన నాకు మాత్రం నేను చేసిన వాటిలో చాలా కొన్ని సినిమాలే నచ్చుతాయి. నేను చేసిన వాటిలో ‘ఏటో వెళ్లిపోయింది మనసు’ నాకు చాలా ఇష్టం.

అంతటితో సమంతతో మా ఇంటర్వ్యూని ముగించాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు