‘ప్రేమమ్’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చైతు!

premam

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ కాగా, మరొకటి దర్శకుడు చందూ మొండేటీ తెరకెక్కించిన ‘ప్రేమమ్’. ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో కొద్దికాలంగా చాలా మార్పులు జరిగాయి. తాజాగా ‘ప్రేమమ్’ విషయమై నాగ చైతన్య స్పష్టమైన ప్రకటన ఒకటి చేశారు. ఆగష్టు నెలలో ఆడియో, సెప్టెంబర్ నెలలో సినిమా విడుదలవుతాయని చెప్పారు.

అయితే ఇంకా పక్కా విడుదల తేదీలను అనుకోలేదని, పూర్తిగా వాటిపై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా తాను చెప్పేవరకూ రిలీజ్ డేట్ విషయంలో వినిపించే వార్తలు నమ్మొద్దని నాగ చైతన్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చైతన్య కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్ళేవిగా ప్రచారం పొందుతోన్న ఈ సినిమాల్లో సాహసం శ్వాసగా సినిమా ఆగష్టులోనే విడుదలవుతుందని వినిపిస్తున్నా, ఆ విషయమై గౌతమ్ మీనన్ ఇంకా ఓ ప్రకటన చేయాల్సి ఉంది.