తెలుగు సినిమా లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే చిరుకి అత్యున్నత పురస్కారాల్లో ఒకటి అయిన పద్మవిభూషణ్ వచ్చినట్టుగా కేంద్రం ప్రకటించడం విశేషంగా మారింది. అయితే ఈ పురస్కారం అందుకునే కార్యక్రమం నేడు ఢిల్లీలో అట్టహాసంగా జరుగగా ఈ వేడుకల్లో మెగాస్టార్ తో సహా తన భార్య సురేఖ, వారి కుమార్తె సుష్మిత కూడా వెళ్లారు.
అంతే కాకుండా మెగా వారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా తన సతీమణి ఉపాసన కూడా వెళ్లారు. అయితే తాజాగా రామ్ చరణ్ పోస్ట్ చేసిన ఓ పిక్ మంచి మూమెంట్ గా మారింది. తన ఇన్స్టాగ్రామ్ తో తమ మొత్తం ఫ్యామిలీ పిక్ షేర్ చేసుకొని తన తండ్రికి ఈ అరుదైన పురస్కారం రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతూ తన తండ్రి విషయంలో గర్విస్తున్నాను అని తెలిపాడు. దీనితో ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.