వెంకీకి ఆ సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అవుతుందా ?

29th, March 2017 - 01:52:22 PM


విక్టరీ వెంకటేష్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గురు’ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. గత చిత్రం ‘బాబు బంగారం’ చెప్పుకోదగ్గ విజయం సాధించకపోవడంతో ఈ చిత్రంపైనే వెంకీ ఆశలుపెట్టుకున్నారు. అదే విధంగా సినిమాపై పూర్తి స్థాయి నమ్మకంగా కూడా ఉన్నారు. దీనికి తోడు గతంలో వెంకీ చేసిన ఒక సూపర్ హిట్ చిత్రం యొక్క సెంటిమెంట్ ఈ సినిమా విషయంలో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2014 లో వెంకీ మలయాళ ‘దృశ్యం’ సినిమాని తెలుగులో కూడా ‘దృశ్యం’ పేరుతో రీమేక్ చేశారు.

ఇప్పుడు చేసిన ‘గురు’ కూడా తమిళ, హిందీ వెర్షన్లకు తెలుగు రీమేక్. అలాగే ‘దృశ్యం’ రీమేక్ వెర్షన్ ను డైరెక్ట్ చేసింది శ్రీప్రియ అనే లేడీ డైరెక్టర్, ‘గురు’ ని కూడా డైరెక్ట్ చేసింది అనే లేడీ డైరెక్టర్ సుధా కొంగర. పైగా 2014లో ‘దృశ్యం’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికన్నా ముందే ప్రీమియర్ షోల రూపంలో ప్రదర్శించారు. కథలో మంచి పట్టుండటంతో ఆ షోల ద్వారా సినిమాకు కావాల్సిన పాజిటివ్ టాక్ బయటికొచ్చి చిత్రం మంచి విజయం అందుకుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో కథను నమ్మి 31వ తేదీ కన్నా ముందే 30వ తేదీన షోలు వేయనున్నారు. కనుక ఇది కూడా ‘దృశ్యం’లానే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయం సాదించి సెంటుమెంట్ రిపీట్ అయింది అనిపిస్తుందేమో చూడాలి.