విడుదల తేదీ : అక్టోబర్ 02, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
నటీనటులు : అజయ్ దేవ్గన్, టబు, శ్రియా సరన్, జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్, రజత్ కపూర్ తదితరులు
దర్శకత్వం : అభిషేక్ పాఠక్
నిర్మాతలు : ఆలోక్ జైన్, అజిత్ అంధారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్
సంగీతం : రవి బస్రూర్, రోచక్ కోహ్లీ, కర్మ
ఛాయాగ్రహణం : సుధీర్ కుమార్ చౌదరి
కూర్పు : సందీప్ ఫ్రాన్సిస్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ ఇప్పుడు తన చివరి భాగం ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం వర్షన్ ఇంకా ముగింపుకు రానప్పటికీ, బాలీవుడ్ పూర్తిగా ఒక కొత్త కథతో వేరొక దారిని ఎంచుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ అజయ్ దేవ్గన్ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
‘దృశ్యం 2’ సంఘటనల తర్వాత, మీరా దేశ్‌ముఖ్ (టబు) మానసికంగా తీవ్రంగా కుంగిపోయి తన ప్రాణాలను తీసుకునేందుకు సిద్ధపడుతుంది. కానీ ఆమె భర్త మహేష్ (రజత్ కపూర్) ఆమెను వారించి, కేస్‌ను మళ్లీ రీఓపెన్ చేసి తమ కొడుకు మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించి, విజయ్ సాల్గాంకర్ (అజయ్ దేవ్గన్)ను జైలుకు పంపాలని ఒప్పిస్తాడు. విజయ్‌ను పట్టుకోవడానికి వారు క్రైమ్ బ్రాంచ్ ఎస్.పి. రాజ్‌వీర్ సింగ్ తోమర్ (జైదీప్ అహ్లావత్)తో చేతులు కలుపుతారు. ఆ తర్వాత విజయ్ సాల్గాంకర్ మరియు అతని శత్రువుల మధ్య సాగే ఎత్తులకు పైఎత్తుల ఆటనే ఈ మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్ :
‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ కంటే ముందు వచ్చిన భాగాలు మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ రూపొందించిన మలయాళ దృశ్యం సినిమాల రీమేక్‌లనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, హిందీ దృశ్యం నిర్మాతలు ఒక సొంత స్క్రిప్ట్‌తో ముందుకెళ్లేందుకు పెద్ద రిస్క్ తీసుకున్నారు, అది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది.
‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ పూర్తి స్థాయి కొత్త కథనంతో సాగుతుంది మరియు ఇది మలయాళ ‘దృశ్యం 3’తో ఏమాత్రం ముడిపడి లేదు. ఈ మూడో భాగాన్ని డిజైన్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. కంటెంట్ విషయంలో ఇలాంటి ఒక కథను తయారు చేసినందుకు అభిషేక్ పాఠక్ మరియు అతని టీమ్‌కు ప్రశంసలు దక్కాల్సిందే.
హిందీ ‘దృశ్యం 2’లోనే ఒరిజినల్ మలయాళం నుండి కొన్ని మంచి మార్పులు చేశారు. ఇక ఈసారి రెండవ భాగానికి దీనిని అనుసంధానించడానికి మేకర్స్ ఎంచుకున్న విధానం చాలా బాగుంది. సినిమా వేగం దాదాపుగా చాలా బాగుంది, ప్రేక్షకలను సీట్ల చివర కూర్చోబెట్టే క్షణాలు ఇందులో చాలా ఉన్నాయి.
ఫస్టాఫ్‌లో సస్పె్న్స్, హాస్యం మరియు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ల చక్కటి కాంబినేషన్‌తో సాగుతుంది. ఇందులో జైదీప్ అహ్లావత్ అజయ్ దేవగణ్‌తో తలపడతారు. ఇంటర్వెల్ సమయంలో వీరిద్దరి మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఒక క్రైమ్ సబ్జెక్ట్‌లో హాస్యాన్ని ఎంత అద్భుతంగా రాశారనేది మరియు అది కథనంతో ఎంత సహజంగా కలిసిపోయిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
సెకండాఫ్‌లో కథ కోర్టురూమ్‌లోకి మారుతుంది. ఇక్కడ సినిమా మరింత ఆకట్టుకుంటుంది. కోర్టురూమ్ సీన్లు ఉత్కంఠభరితంగా ఉంటాయి మరియు ట్విస్ట్‌లు చాలా బాగుంటాయి. కుటుంబ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా అజయ్ దేవగణ్ మరోసారి నటనలో రాణించాడు. ఆయన పండించిన ఎమోషన్స్ సటిల్డ్‌గా ఉంటాయి.
ఈ సినిమాలో మరో మేజర్ ప్లస్ పాయింట్ జైదీప్ అహ్లావత్ అని చెప్పాలి. ఆయన తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసి, సినిమా ఇంపాక్ట్‌ను మరింత పెంచారు. ప్రకాష్ రాజ్, శ్రియా సరన్, ఇషితా దత్తా, కమ్లేష్ సావంత్ మరియు ఇతరులు తమ పాత్రలలో మెప్పించారు.
మైనస్ పాయింట్లు:
ఇది ఈ ఫ్రాంచైజీకి చివరి ఘట్టం కావడంతో, సినిమా ఆఖరికి ఎవరు గెలుస్తారో మనం ముందే ఊహించవచ్చు. దీనివల్ల ఆశ్చర్యపరిచే ఎలిమెంట్ కొంత తగ్గుతుంది. సినిమా ఉత్కంఠను సరిగ్గా మెయింటైన్ చేసినప్పటికీ, క్లైమాక్స్‌లో చివరికి ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
సినిమా ఆ పాయింట్‌కి ఎలా చేరుకుంటుందనేదే ఇక్కడ ముఖ్యం. ఆ విషయంలో మేకర్స్ గట్టి వర్క్ చేశారు. అజయ్ దేవగణ్‌తో పోటీ పడే క్రమంలో ప్రకాష్ రాజ్ మరియు జైదీప్ అహ్లావత్ ప్రయత్నించగా, టబు పాత్ర వెనుకబడిపోయింది.
సాంకేతిక వర్గం:
రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సెకండాఫ్‌లో బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఆయన ఇంకా మంచి వర్క్ చేసి ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలకు మరింత పవర్‌ఫుల్ స్కోర్ అవసరమైంది. సుధీర్ చౌదరి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సందీప్ ఫ్రాన్సిస్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అభిషేక్ పాఠక్ రైటింగ్ మరియు డైరెక్షనే ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అనే అనుమానాలకు ఆయన తన రైటింగ్‌తో జవాబు ఇచ్చారు.
తీర్పు:
మొత్తంగా చూస్తే, ఇండియన్ సినిమాల్లో ది బెస్ట్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం – ది కన్‌క్లూజన్’ ఒక పర్ఫెక్ట్ ముగింపుగా నిలిచింది. ఒరిజినల్ వర్షన్ మలయాళంలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయిన ‘దృశ్యం 3’లో చేసిన తప్పులు ఈ సినిమాలో చేయలేదు. ఒక మంచి కథను అనవసరంగా సాగదీసినప్పుడు అది తన మ్యాజిక్‌ను కోల్పోతుంది. హిందీ దృశ్యం 3 మేకర్స్ ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఒక ఆసక్తికరమైన ఓరిజినల్ కథ, చక్కని స్క్రీన్‌ప్లే, సన్నివేశాలకు తగిన కామెడీతో ఈ సినిమాను ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. క్లైమాక్స్ పెద్దగా ఆశ్చర్యపరచకపోయినా సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మెయింటెయిన్ చేయడంలో సక్సెస్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర ఈ ‘దృశ్యం ది కన్‌క్లూజన్’ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.
123telugu.com Rating: 3.5/5
Reviewed by 123telugu Team


