విడుదల తేదీ : అక్టోబర్ 09 , 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, ఉపేంద్ర లిమాయె, రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్ తదితరులు
దర్శకత్వం : గుణి మంచికంటి
నిర్మాత : వేణు దోనేపూడి
సంగీతం : ఎలక్ట్రానికల్లీ కళికా
ఛాయాగ్రహణం : అజయ్ అబ్రహం జార్జ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యువ నటులు అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ “బా బా బ్లాక్ షీప్”. మేఘాలయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ:
సందీప్ (అక్షయ్ లగుసాని), సత్తిపండు (విష్ణు ఓయ్) ప్రాణస్నేహితులు. సత్తిపండు పెళ్లి కోసం వీరిద్దరూ మేఘాలయ వెళ్తారు. అయితే, అక్కడ అనుకోకుండా ఒక రహస్య సీక్రెట్ బాక్స్ సందీప్‌కి దొరుకుతుంది. కట్ చేస్తే, పెళ్లి పీటల మీద ఉన్న సత్తిపండును జాన్ (ఉపేంద్ర లిమాయె) అనే గ్యాంగ్‌స్టర్ కిడ్నాప్ చేసి, ఆ సీక్రెట్ బాక్స్ ఇస్తేనే అతడిని వదిలేస్తానని కండిషన్ పెడతాడు. దాంతో సందీప్ తన ఫ్రెండ్ జాన్వీ (విస్మయ శ్రీ)తో కలిసి ఆ బాక్స్ కోసం వేట మొదలుపెడతాడు. అసలు ఆ సీక్రెట్ బాక్స్‌లో ఏముంది? ఈ క్రైమ్ డ్రామాలో ఇతర పాత్రల ప్రమేయం ఏమిటి? చివరికి సత్తిపండును సందీప్ ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
సత్తిపండు పాత్రలో నటించిన విష్ణు ఓయ్ తన మేనరిజమ్స్, తెలంగాణ యాసతో కొన్ని చోట్ల నవ్వులు పూయించాడు.
అజయ్ అబ్రహం జార్జ్ కెమెరా పనితనం చాలా బాగుంది. మేఘాలయ అందాలను, కొండ ప్రాంతాలను తెరపై చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా చూపించారు.
అక్షయ్ లగుసాని తన పాత్ర పరిధి మేర బాగానే నటించాడు. గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఉపేంద్ర లిమాయె తన విలనిజంతో పాటు లైట్ కామెడీతో ఓకే అనిపించాడు. హీరోయిన్లు విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా గ్లామరస్‌గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ రొటీన్ కథ మరియు ఫ్లాట్ స్క్రీన్‌ప్లే. ఫస్ట్ హాఫ్‌లో కథ అసలు ముందుకు సాగక ప్రేక్షకుల ఓపికను పరీక్షిస్తుంది.
క్రైమ్ కామెడీ జానర్‌కి ప్రాణమైన కామెడీ సీన్లు చాలా చోట్ల ఫోర్స్డ్‌గా అనిపిస్తాయి. సీరియస్ సీన్లలో లాజిక్స్ మిస్ అవ్వడం, కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్స్ ఎక్కువవ్వడం నిరాశపరుస్తుంది.
సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ, దేనికీ సరైన జస్టిఫికేషన్ లేదా డెప్త్ ఉండదు. దానివల్ల కథనం చాలా చోట్ల దిశ కోల్పోయినట్లు అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉంటే సినిమా కాస్త వేగంగా ముందుకు సాగేది.
సాంకేతిక వర్గం:
దర్శకుడు గుణి మంచికంటి ఎంచుకున్న క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ బాగున్నా, దానిని తెరపై ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్లలో పర్వాలేదనిపించినా, పాటలు ఏమాత్రం గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. మేఘాలయ అందాలను బాగా చూపెట్టారు. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘బా బా బ్లాక్ షీప్’ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా కొంతవరకే మెప్పిస్తుంది. మేఘాలయ లొకేషన్లు, కొన్ని నవ్వులు పూయించే సన్నివేశాలు, టామ్ అండ్ జెర్రీ తరహా ఛేజ్ సీన్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్. స్లో నరేషన్, లాజిక్ లేని సీన్స్ బలహీనతలుగా నిలిచాయి. క్రైమ్ కామెడీ జానర్ ఇష్టపడే వారికి ఈ సినిమా కొంతవరకే కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


