ఓటీటీలోకి వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘షాహిద్’.. ఏకంగా 13 ఏళ్ల తర్వాత..!

ఓటీటీలోకి వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘షాహిద్’.. ఏకంగా 13 ఏళ్ల తర్వాత..!

Published on Sep 29, 2026 11:19 PM IST

బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్‌గా రాజ్‌కుమార్ రావు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ‘షాహిద్’ అనే చిత్రం 2013లో విడుదలై రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్‌లో నటించాడు.

మానవ హక్కుల న్యాయవాది షాహిద్ అజ్మీ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, విడుదలైన దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో కాకుండా కేవలం హిందీ భాషలోనే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

ముంబైకి చెందిన లాయర్ షాహిద్ అజ్మీ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ అన్యాయంగా కేసుల్లో చిక్కుకున్న వారి తరఫున చేసిన న్యాయపోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. 2010లో ఆయన దారుణ హత్యకు గురికాగా, ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను హన్సల్ మెహతా ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ఈ సినిమాకు గాను హన్సల్ మెహతా ‘ఉత్తమ దర్శకుడిగా’, రాజ్‌కుమార్ రావు ‘ఉత్తమ నటుడిగా’ నేషనల్ అవార్డులు అందుకున్నారు. మరి ఇన్నేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు