మరోసారి కంచరపాలెం గడ్డ నుంచి.. వెంకటేష్ మహా కొత్త చిత్రం ‘అట్టహాసం’

మరోసారి కంచరపాలెం గడ్డ నుంచి.. వెంకటేష్ మహా కొత్త చిత్రం ‘అట్టహాసం’

Published on Oct 6, 2026 9:04 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందిన వెంకటేష్ మహా తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ‘రావు బహదూర్’ భిన్న స్పందనలను రాబట్టుకుంది. ఆ సినిమాను కొందరు ఎంతగానో ఆదరిస్తే, మరికొందరి నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన తన కొత్త చిత్రాన్ని ప్రకటిస్తూ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను పంచుకున్నారు.

ఈ చిత్రానికి ‘అట్టహాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తన మొదటి చిత్రమైన ‘కేరాఫ్ కంచరపాలెం’ తరహాలోనే, ఈ కథ కూడా కంచరపాలెం గడ్డ నుంచే వస్తోందని వెంకటేష్ మహా పేర్కొన్నారు. నిజాయతీతో కూడిన సహజమైన భావోద్వేగాలు, కడుపుబ్బా నవ్వించే వినోదంతో ఈ సినిమా ఉండబోతోందని స్పష్టం చేశారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రెండు జంటల మధ్య ఉండే వ్యత్యాసాన్ని వినూత్నంగా చూపించి ప్రాజెక్ట్‌‌పై ఆసక్తిని పెంచారు.

ఈ చిత్రంలో వెంకటేష్ మహా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ స్రవంతి పీపకాయల, నటుడు కార్తీక్ రత్నం, ‘పుష్ప 2’ ఫేమ్ పవని కరణం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చింతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ రూటెడ్ ఎంటర్‌టైనర్‌ను 2027 వేసవి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు