సమీక్ష : సికందర్ – సూర్య వన్ మాన్ షో.!

సమీక్ష : సికందర్ – సూర్య వన్ మాన్ షో.!

Published on Aug 16, 2014 2:00 PM IST
sikandhar-review విడుదల తేదీ : 15 ఆగష్టు 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : ఎన్. లింగుసామి
నిర్మాత : సుభాస్ చంద్రబోస్, లగడపాటి శ్రీధర్, లగడపాటి శిరీష.. 
సంగీతం : యువన్ శంకర్ రాజా
నటీనటులు : సూర్య, సమంత, విద్యుత్ జమ్వాల్…


తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సూర్య సరికొత్త లుక్ లో మనముందుకు వచ్చిన సినిమా ‘సికందర్’. సూర్య సరసన మోస్ట్ వాంటెడ్ సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కమర్షియల్ డైరెక్టర్ ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో మాఫియా చుట్టూ ఈ తిరిగే సినిమాకి నేషనల్ లెవల్లో ఫేమస్ అయిన సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉందో? లేదో? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

కథ కృష్ణ(సూర్య)పాత్రతో మొదలవుతుంది. ముంబైలో ఉన్న తన అన్నయ్య రాజు భాయ్(సూర్య)ని కలవడం కోసం కృష్ణ వైజాగ్ నుండి ముంబై వెళతాడు. అక్కడికి వెళ్ళిన కృష్ణకి రాజు భాయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్..

రాజు భాయ్ – చందు(విద్యుత్ జమ్వాల్) మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ముంబై మాఫియా సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా వారి ఎదుగుదల చూసిన మాఫియా డాన్ ఇమ్రాన్ భాయ్(మనోజ్ బాజ్ పాయ్) వాళ్ళని అణచి వేయాలనుకుంటాడు. ఈ టైంలోనే రాజు భాయ్ జీవ(సమంత)తో ప్రేమలో పడతాడు. అప్పుడే కథలో అసలైన ట్విస్ట్. కథలో ఈ అసలైన ట్విస్ట్ ఏంటి? రాజు భాయ్ – చందులకు ఏమైంది.? అసలు కృష్ణ రాజు భాయ్ ని ఎతుక్కుంటూ ఎందుకు వస్తాడు? ఇంతకీ రాజు భాయ్ – కృష్ణ వేరు వేరా? లేక ఒకరేనా? అనే ఆసక్తికర అంశాలను మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచి ఈ చిత్ర టీం చెప్పినట్లు ఈ సినిమాకి వన్ అండ్ ఓన్లీ మేజర్ హైలైట్ సూర్య అనే చెప్పాలి. ఆ తర్వాత మిగతావన్నీ బోనస్ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవాలి. ఈ మూవీలో సూర్య రాజు భాయ్ గా ట్రై చేసిన న్యూ లుక్, స్టైల్, అతని మానరిజం సింప్లీ సూపర్బ్. అలాగే కృష్ణ గా కూడా పెర్ఫార్మన్స్ కూడా అదరగొట్టాడు. సినిమాలో ఉన్న రెండు పాత్రల్లో డిఫరెంట్ లుక్ తో కనిపించడమే కాకుండా ఎంతో వైవిధ్యమైన నటనని కనబరిచి అందరి చేత శభాస్ అనిపించుకున్నాడు.

ఈ సినిమాకి నెక్స్ట్ ఉన్న స్పెషల్ అట్రాక్షన్ సమంత. సమంత పక్కింటి అమ్మాయిలాంటి పాత్రలే చేస్తుంది అన్న ఇమేజ్ నుంచి గ్లామర్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ మధ్య ఫుల్ గ్లామరస్ రోల్స్ ని ఎంచుకుంటోంది. ‘అల్లుడు శీను’ సినిమా సమంత గ్లామర్ డోస్ కి టీజర్ అయితే ‘సికందర్’ తన అందాల ఆరబోతకి ఫుల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో సమంత అందాల ఆరబోత ఎంత అడ్వాన్స్ అయ్యింది అంటే ఓ పాటలో బికినీలో కూడా వేసేంత, దీన్ని బట్టి సమంత అందాలు ఆరబోయడంలో ఎంత విజ్రుంభించింది అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా..!

ఇక హీరో సూర్య లుక్ అండ్ పర్సనాలిటీకి పక్కన పర్ఫెక్ట్ గా సరిపోయేలా ఉండే విద్యుత్ జమ్వాల్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. మెయిన్ విలన్ గా నటించిన మనోజ్ భాజ్ పాయ్ రియల్ డాన్ లుక్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసిన చిత్రాంగద సింగ్ తన అందచందాలతో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలా పెద్దదా ప్లస్ అవుతుంది. సినిమా కాస్త నిధానంగా మొదలైనప్పటికీ రాజు భాయ్ పాత్ర రాగానే బాగా ఊపందుకుంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో రాజు భాయ్ పాత్ర హీరోయిజంని ఎలివేట్ చేసే సీన్స్ ని చాలా బాగా తీసారు. అలాగే ఇంటర్వల్ బ్లాక్ దగ్గర హీరో ఎలివేషన్ సీన్స్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. అలాగే సెకండాఫ్ లో క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ బాగా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

మొదటగా ఈ సినిమాకి చెప్పుకోవాల్సిన బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ రన్ టైం. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు, ఈ సినిమాలో అనవసరంగా ఉన్న సీన్స్ చాలా ఉన్నాయి, ఉదాహరణకి – బ్రహ్మానందం ఎపిసోడ్ నుంచి తర్వాత వచ్చే రెండు మూడు సీన్స్ ని లేపేయవచ్చు. అవి కథకి అస్సలు అవసరం లేదు చాలా బలవంతంగా మూవీలో ఇరికించినట్టు ఉంటుంది. అలాంటివి సినిమాలో చాలానే ఉన్నాయి, వాటిని కట్ చేస్తే సినిమాకి చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సెకండాఫ్. ఇంటర్వల్ బ్లాక్ బాగా ప్లాన్ చేసుకునున్న లింగుసామి ఆ తర్వాత అంత స్పీడ్ గా సెకండాఫ్ ని డీల్ చెయ్యకుండా ఒక సీన్ కథకి సంబంధం ఉండేలా, ఒక సీన్ కథకి సంబంధం లేకుండా ఉండేలా రాసుకుంటూ సెకండాఫ్ ని సాగదీశాడు. అందుకే ఆడియన్స్ చాలా చోట్ల బోర్ ఫీలవుతారు.

ఈ సినిమాలో సూర్య – సమంత మధ్య వచ్చే తరహా లవ్ ట్రాక్ ని తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ సినిమాలో చూసాం. అలాగే కథలో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. మనం ఇలాంటి కథలనే ‘భాషా’, ‘దళపతి’ మొదలైన సినిమాల్లో చూసాం. రెగ్యులర్ రివెంజ్ డ్రామాని లింగుసామి స్క్రీన్ ప్లే తో మేనేజ్ చేద్దాం అనుకున్నాడు ఫస్ట్ హాఫ్ లో సక్సెస్ అయినా సెకండాఫ్ లో ఫెయిల్ అయ్యాడు. అలాగే చాలా పాత్రలకి సరైన ముగింపు లేదు. ఉదాహరణకి సమంత ఫాదర్ మరియు పోలీస్ కమీషనర్ అశోక్ కుమార్ పాత్రకి సరైన స్టార్టింగ్, సరైన ముగింపు లేదు. సినిమాలో ఇలాంటి పాత్రలు కూడా చాలా ఉన్నాయి. అలాగే పాటలు చూడటానికి బాగున్నా అవసరం లేని చోటల్లా పాటలు వచ్చి సినిమా ఫ్లోని పోగొడతాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో వావ్ ఏం డీల్ చేసారురా ఈ డిపార్ట్మెంట్ ని, వీళ్ళకి హ్యాట్సాఫ్ చెప్పాలి అనేవారు ఈ మూవీ టెక్నికల్ టీంలో ఇద్దరే ఉన్నారు. అందులో సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఒకరైతే, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజ. సంతోష్ శివన్ ముంబైలోని లోకేషన్స్ ని చాలా గ్రాండ్ విజువల్స్ రూపంలో చూపించడమే కాకుండా, నటీనటుల్ని కూడా చాలా కొత్తగా చూపించాడు. ఇక యువన్ శంకర్ రాజ అందించిన పాటలు తెలుగులో పెద్ద హిట్ కాకపోయినప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. హీరో ఎలివేషన్ సీన్స్ లో యువన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. ఎడిటర్ ఆంటోని సెకండాఫ్ విషయంలో కేర్ తీసుకొని సినిమాకి సంబంధంలేని కొన్ని సీన్స్ ని అన్నా కట్ చేసి ఉండాల్సింది. సెల్వ కంపోజ్ చేసిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆడియన్స్ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యేలా లేవు.

ఇప్పటి వరకూ కమర్షియల్ సినిమాలతో ఆకట్టుకున్న లింగుసామి ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. కథ – కొత్తదనం లేని రెగ్యులర్ రివెంజ్ డ్రామా, స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్ బాగానే రాసుకున్నారు కానీ సెకండాఫ్ పక్కదారి పట్టించేయడంతో ఆడియన్స్ కూడా ఎగ్జిట్ ద్వారాన్ని ఎంచుకున్నారు. నటీనటుల నుంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకోవడంలో మాత్రం దర్శకుడిగా లింగుసామి సక్సెస్ అయ్యాడు. కానీ తన గత సినిమాల తరహాలో అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడంలో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. నిర్మాణ విలువలు మాత్రం హై రేంజ్ లో ఉన్నాయి. ప్రతి సీన్ లోనూ రిచ్ నెస్ కనిపిస్తుంది.

తీర్పు :

స్టార్ ఇమేజ్ ఉన్న సూర్య – లింగుసామి – సమంత కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘సికందర్’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా ట్రైలర్స్, సూర్య లుక్, ప్రమోషన్స్ లో చెప్పిన దాని ప్రకారం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆశించి ప్రేక్షకులు ఈ సినిమాకి వస్తారు కానీ వారు ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేకపోవడం వలన కాస్త నిరాశకి గురవుతారు. సూర్య వన్ మాన్ షో ఈ సినిమాకి మేజర్ హైలైట్ అయితే సమంత గ్లామర్ డోస్, ఫస్ట్ హాఫ్ బోనస్ అట్రాక్షన్ పాయింట్స్. ఓల్డ్ స్టొరీ, వీక్ సెకండాఫ్, రన్ టైం ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. సూర్య అభిమానులకు మాత్రం బాగా నచ్చే ఈ సినిమాని తెలుగులో కూడా ఎక్కువ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడం వలన ఫస్ట్ వీకెండ్ మాత్రం కలెక్షన్స్ బాగా రాబట్టుకునే అవకాశం ఉంది.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు